మలేరియా కేసుల్లో 71.57 శాతం త‌గ్గుద‌ల‌

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనే అత్య‌ధిక కేసులు
3 జిల్లాల్లో కేసులు లేవు

మంత్రి  సత్య కుమార్ యాద‌వ్‌కు నివేదించిన అధికారులు

మలేరియా కేసులు రాష్ట్రంలో బాగా తగ్గుముఖం పట్టాయి. 2030 నాటికి మలేరియా కేసులను నియంత్రించాలన్న లక్ష్యంలో ఇప్పటి వరకు 71.57 శాతం త‌గ్గుద‌ల‌ నమోదైంది. రాష్ట్రంలో 2015లో 25,042 మలేరియా కేసులు నమోదుకాగా 2025లో 7,119 కేసులు (71.57 శాతం త‌గ్గుద‌ల‌) నమోదయ్యాయి. 2025 లో తొలి ఆరు వారాల్లో 625 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది (2026) తొలి ఆరువారాల్లో 166 కేసులు రికార్డయ్యాయి. దీని ప్రకారం మలేరియా కేసుల తగ్గుదల 73.44% వరకు నమోదైంది. ఈ క్రమంలో నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్-2030 ప్రకారం మలేరియా వ్యాధి అదే ప్రాంతంలో దోమ కుట్టడం ద్వారా వచ్చే మ‌లేరియా( ఇండిజినెస్ ) కేసుల నియంత్రణ లక్ష్యాన్ని (ఇండిజినెస్ ట్రాన్స్ మిష‌న్) సాధించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు నివేదించారు. అధికారులు నివేదికలో పేర్కొన్న ప్రకారం మలేరియా కేసులతోపాటు డెంగీ, చికెన్ గున్యా, ఫుడ్ పాయిజ‌నింగ్ , అవుట్‌ బ్రేక్ కేసులు కూడా రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయి.

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లోనే కేసులు అధికం

రాష్ట్రంలో మలేరియా కేసులు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే మలేరియా కేసుల్లో ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో నమోదైన 7,871 మలేరియా కేసుల్లో 3,693 అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,654 కేసులు రికార్డయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో 80.63% (6,347) నమోదుకాగా మిగిలిన కేసులు ఇతర జిల్లాల్లో రికార్డయ్యాయి. 2025లో 7,119 కేసులు నమోదుకాగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 3,513, పార్వతీపురం మన్యం జిల్లాలో 1,820 కేసులు చొప్పున రికార్డయ్యాయి. దీని ప్రకారం రాష్ట్రంలో నమోదైన 7,119 కేసుల్లో 74.91% (5,333) కేసులు ఈ రెండు జిల్లాల్లోనే నమోదయ్యాయి అటవీ ప్రాంతం కావడం, కొండలు, కోనల్లో గిరిజనులు నివాసాలు ఉండడం, వలసలు, ప్రాజెక్టుల కార్యకలాపాలు, వాతావరణంలోని మార్పువల్ల ఈ జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువ‌గా ఉంటున్నాయి.

 

3 జిల్లాల్లో కేసులు నిల్

బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో గత మూడు సంవత్సరాల నుంచి మలేరియా కేసులు నమోదు కావడంలేదు. 2025లో నమోదైన కేసుల ప్రకారం… ఒకటి లేదా రెండు కేసులలోపు నమోదవుతున్న జిల్లాల్లో తూర్పుగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు, తిరుపతి ఉన్నాయి. పదిలోపు కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అనంతపురం, గుంటూరు, నెల్లూరు, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. 20లోపు కేసులు నమోదవుతున్న జిల్లాల్లో కడప, నంద్యాల, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో 38 లోపు కేసులు, 50 లోపు కేసులు వున్న ఎన్టీఆర్ జిల్లా రికార్డవుతున్నాయి.

48 శాతం డెంగీ కేసుల తగ్గుదల

రాష్ట్ర వ్యాప్తంగా 2023లో 6,453 డెంగీ కేసులు రికార్డయ్యాయి. 2024లో 5,555, 2025లో 2,686 (48.35% తగ్గుదల) కేసుల చొప్పున కేసులు వచ్చాయి. 2024లో 266 కేసులు రాగా, 2025లో 146 (54.88%) కేసులు నమోదయ్యాయి.

నీటి కలుషిత కేసుల తగ్గుదల

2024లో నీటి కలుషిత ఘటనలు రాష్ట్రంలో 50 నమోదయ్యాయి. 2025లో 22 నమోదయ్యాయి ఫుడ్ పాయిజనింగ్ (ఆహార కలుషిత) ఘటనలు 2024లో 53 నమోదుకాగా 2025లో 42 రికార్డయ్యాయి. 2025లో తొలి ఆరువారాల్లో నీటి కలుషిత ఘటనలు రెండు నమోదు కాగా ఇదే సమయానికి 2026లో ఒకటి వచ్చింది. 2024లో 22 కలరా కేసులు నమోదయ్యాయి. 2025 లో ఆరు వచ్చాయి. 2025లో తొలి ఆరువారాల్లో 2 కేసులు నమోదుకాగా ఈ ఏడాది ఒకటీ కూడా నమోదుకాలేదు.

దోమల నియంత్రణకు తీసుకున్న చర్యలు

ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలల్లో ఒక్కొక్కసారి చొప్పున మలేరియా హాట్‌ స్పాట్‌ గ్రామాల్లోని ఇళ్లల్లో ఇండోర్ రెసిడ్యువ‌ల్‌ స్ప్రే (మందు పిచికారీ చేయడం-ఏసీఎం 5%)ను పక్కాగా చేస్తూ వస్తున్నారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో అదనంగా ఐఆర్ఎస్ స్ప్రే కూడా చేస్తున్నారు.

యాంటీ లార్వాల ఆపరేషన్లను నిర్వహించి దోమల సంతతి పెరగకుండా రసాయనాలు చల్లుతున్నారు. ఫాగింగ్ కూడా చేస్తున్నారు.

గంబోజియా ఫిష్ ల ను నీటి నిల్వలో వదులుతున్నారు. ఇవి దోమల లార్వాను ఆహారం కింద తీసుకుంటాయి.

డ్రోన్ల ఆధారంగా కూడా యాంటీ లార్వాల (పిచికారీ) ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు.

మలేరియా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో స్థానిక నేతల సాయంతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నారు.

దోమ తెరల పంపిణీ

గిరిజనులకు దోమల తెరలను ప్రభుత్వం ఇస్తోంది. త్వరలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని గిరిజనులకు 89,845 దోమతెరలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. మరోవైపు జ్వరాల కేసుల నమోదు అనుసరించి సదరు ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచుతున్నారు. తద్వారా జ్వరాల రకాన్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *