ఎన్సీడీ 4.0లో ఇప్పటికే 2.83 కోట్ల మందికి పైగా పరీక్షలు
ఎన్సీడీ ద్వారా వ్యాధుల గుర్తింపు.. ‘సంజీవని’తో నిరంతర వైద్యం
మందుల భద్రత, సురక్షిత వైద్య విధానాలకు ప్రాధాన్యం
సెప్టెంబరు 17న ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం
ఆస్పత్రుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో.. ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, మందులను సురక్షితంగా వినియోగించడం, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలన్నారు.నాన్ కమ్యూనికేషన్ డిసీసెస్ (ఎన్సీడీ) 4.0లో ఇప్పటికే 2.83 కోట్ల మందికి పైగా పరీక్షలు నిర్వహించగా.. 59.38 లక్షల మందిలో అధిక రక్తపోటు, 48.32 లక్షల మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి గుర్తించిన వారికి సకాలంలో వైద్యం అందేలా ‘సంజీవని’ ద్వారా సేవలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 17 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా మంత్రి బుధవారం ప్రకటన విడుదల చేశారు.

ముందస్తు పరీక్షలతో వ్యాధి గుర్తింపు
రక్తపోటు, మధుమేహంతో పాటు నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఎన్సీడీ 4.0 ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. క్యాన్సర్ పరీక్షల్లో అనుమానం ఉన్న వారిని తదుపరి పరీక్షలు, అవసరమైన చికిత్స కోసం పంపిస్తున్నామని చెప్పారు. వ్యాధి గుర్తించిన తర్వాత వైద్యం అందడంలో జాప్యం లేకుండా చూడాలని వైద్యులకు సూచించారు. అవసరమైన మందులు సరైన మోతాదులో, సరైన సమయంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

‘సంజీవని’తో నిరంతర వైద్యం
పరీక్షల్లో వ్యాధి ఉన్నట్లు తేలిన తర్వాత రోగికి తదుపరి వైద్యం అందడంలో ఎలాంటి అంతరాయం ఉండకూడదన్నారు. ‘సంజీవని’ ద్వారా పరీక్షలు, చికిత్స, మందులు, తదుపరి పర్యవేక్షణ వంటి సేవలను అనుసంధానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వైద్యం పొందేలా సేవలను కొనసాగించాలని సూచించారు. ప్రతి రోగి ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ చేస్తున్నామని తెలిపారు. సంజీవని ద్వారా రోగులకు ఆరోగ్య భద్రత మరిoత పెరుగుతుందని చెప్పారు.
మందుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
రోగికి అవసరమైన మందులు సరైన మోతాదులో, సరైన సమయంలో అందడం చికిత్సలో కీలకమన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకునేలా రోగులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రోగులు తాము గతంలో తీసుకున్న చికిత్స, ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలను వైద్యులకు స్పష్టంగా తెలియజేయాలని, సొంతంగా మందుల మోతాదును మార్చడం లేదా నిలిపివేయడం చేయకూడదని తెలిపారు.
రోగి.. కుటుంబం భాగస్వామ్యం
రోగి భద్రతలో రోగి, కుటుంబ సభ్యుల భాగస్వామ్యం కూడా ముఖ్యమన్నారు. రోగులు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యులు అండగా నిలవాలని తెలిపారు. మందులు సకాలంలో తీసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడంలో సహకరించాలని మంత్రి సూచించారు.
ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాల పరిశీలన
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి భద్రతకు సంబంధించిన విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. చికిత్స సమయంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని సూచించారు. రోగి వివరాల నమోదు, మందుల భద్రత, చికిత్స విధానాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. మంచి విధానాలను గుర్తించి అన్ని ఆస్పత్రుల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
అవగాహన కార్యక్రమాలు
ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాలు, బోధనాస్పత్రుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి రోగి భద్రత, మందుల భద్రత, సురక్షిత వైద్య విధానాలపై అవగాహన కల్పించాలని మంత్రి శ్రీ సత్య కుమార్ సూచించారు.

