అన్ని స్పెషాల్టీల్లో కలిపి 15 శాతం సీట్ల కేటాయింపు

విధులకు హాజరుకావాలని పీహెచ్సీ వైద్యులను కోరిన వైద్య ఆరోగ్య శాఖ

పీహెచ్సీ వైద్యుల సంఘం కోరిక మేరకు పీజీ ఇన్-సర్వీస్ కోటాలో 15% సీట్లను అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కేటాయించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం అంగీకరించింది. అమరావతిలోని సచివాలయంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు ఇన్-సర్వీస్ పీజీలో 15% కోటా కింద సీట్లను క్లినికల్ కేటగిరిలోని అన్ని స్పెషాల్టీల్లో కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సంఘం ప్రతినిధులకు తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని మరో మూడేళ్లపాటు యథావిధిగా కొనసాగించాలని సంఘం ప్రతినిధులు ఉన్నతాధికారులను కోరారు. ‘ఈ అంశంపై సమగ్రంగా అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసి, విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. వచ్చే నవంబరులో మరోమారు చర్చిద్దాం. వైద్యులపట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుంది. వెంటనే విధులకు హాజరుకావాలి. రోగులను ఇబ్బంది పెట్టొద్దు’ అని ఉన్నతాధికారులు సంఘం ప్రతినిధులను కోరారు. సభ్యులతో చర్చించి, తమ నిర్ణయాన్ని తెలియబరిచేందుకు కాస్త సమయం కావాలని సంఘం ప్రతినిధులు ఉన్నతాధికారులకు తెలియచేశారు. వాస్తవానికి సచివాలయంలో కంటే ముందుగానే మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వీరపాండియన్ సంఘం ప్రతినిధులతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా చర్చించారు.

భవిష్యత్తు అవసరాలు అనుసరించి…

పీజీ ఇన్సర్వీస్ కోటాలో సీట్ల పెంపు కోసం పీహెచ్సీ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఖాళీ అయ్యే వైద్యుల పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 3 క్లినికల్ స్పెషాల్టీల్లో మాత్రమే 15% ఇన్-సర్వీస్ కోటా ఉండాలని కొద్దికాలం కిందట నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే వైద్యుల సంఘం విజ్ఞప్తి మేరకు ఇటీవల 7 క్లినికల్ స్పెషాల్టీల్లో 15% కోటా కింద సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో బుధవారం జరిగిన చర్చల సందర్భంగా పీహెచ్సీ వైద్యుల సంఘం విజ్ఞప్తి మేరకు అన్ని క్లినికల్ స్పెషాల్టీ కోర్సుల్లో 15% సీట్ల భర్తీపై నిర్ణయం జరిగింది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *