ఎయిమ్స్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య‌శ్రీ సేవ‌లు

  • మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
  • “సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్ “గా ఎయిమ్స్ అభివృద్ధి
  • ఎయిమ్స్ కు మౌలిక వ‌సతులు క‌ల్పించింది సిఎం జగన్
  • రూ.55 కోట్ల‌తో ఎయిమ్స్ కు నీరు , క‌రెంటు, రోడ్లు 
  • ఎయిమ్స్  ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

మంగ‌ళ‌గిరిలోని ప్ర‌తిష్టాత్మ‌క ఎయిమ్స్ ను వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకురాబోతున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ, వైద్య విద్య మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థను(ఎయిమ్స్) సోమ‌వారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని సంద‌ర్శించారు. ఆస్ప‌త్రిలో అందుతున్న వైద్య సేవ‌ల‌పై రోగుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అన్ని విభాగాల్లోనూ మంత్రి క‌లియ‌తిరిగారు. వైద్య ప‌రిక‌రాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. అనంత‌రం ఎయిమ్స్ అధికారులు, సిబ్బందితో కాన్ఫ‌రెన్సు హాలులో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి వెంట వైద్య ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి (కొవిడ్ మేనేజ్ మెంట్ & వ్యాక్సినేషన్ ) జిఎస్ న‌వీన్‌కుమార్‌, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్‌, ఆరోగ్య‌శ్రీ సీఈవో హ‌రీంద్ర‌ప్ర‌సాద్ , ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి , డీన్ డాక్టర్ జోయ్ ఘోషల్ త‌దిత‌రులున్నారు. త‌నిఖీ స‌మ‌యంలోనూ, మీడియా స‌మావేశంలోనూ మంత్రి మాట్లాడారు. ఎయిమ్స్‌లో ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామ‌న్నారు.
అతి త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఆరోగ్య‌శ్రీ సేవ‌లు అందుబాటులోకొస్తాయ‌న్నారు. పేద ప్ర‌జ‌లంతా ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని మంత్రి సూచించారు. మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్ తో ఏపీ ప్రభుత్వం అతి త్వ‌ర‌లోనే ఎంవోయూలు కుదుర్చుకోబోతోంద‌ని తెలిపారు. దీనివ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లోని విద్యార్థుల‌కు ఆయా అంశాల్లో ఎయిమ్స్ నుంచి అత్యుత్త‌మ శిక్ష‌ణ ల‌భిస్తుంద‌న్నారు. “సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్” గా ఎయిమ్స్ ను అభివృద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్నామ‌ని, అందుకు కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు ప్రభుత్వం అందిస్తుంద‌న్నారు.

ఎయిమ్స్ లో వసతులను పరిశీలిస్తున్న వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

తాగునీటి శాస్వత ప‌రిష్కారానికి ప‌నులు ప్రారంభం
ఎయిమ్స్‌కు తాగునీటి స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు ఆత్మ‌కూరు రిజ‌ర్వాయ‌ర్ నుంచి రూ.7.74 కోట్ల ఖ‌ర్చుతో పైపు లైను ప‌నులు మొద‌లుపెట్టామ‌ని చెప్పారు. సోమ‌వారం నుంచే ఈ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు. తాత్కాలికంగా ఈ స‌మ‌స్య లేకుండా చేసేందుకు మంగ‌ళ‌గిరి- తాడేపల్లి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి రోజుకు 3.5ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు. మ‌రో ల‌క్ష లీట‌ర్ల నీటిని అత్య‌వ‌స‌ర స‌మయాల్లో వాడుకునేందుకు వీలుగా ప్ర‌తి రోజూ అందుబాటులో ఉంచుతున్నామ‌న్నారు.
ప్ర‌భుత్వ స‌హ‌కారం ప‌రిపూర్ణంగా ఉందిః ఎయిమ్స్ డైరెక్ట‌ర్ త్రిపాఠి
ఎయిమ్స్ కు సంబంధించిన‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ‌కు పూర్తిగా స‌హాయ‌స‌హ‌కారాలు అంద‌జేస్తోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ త్రిపాఠి ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వం దృష్టికి ఏ స‌మ‌స్య‌ను తీసుకెళ్లినా.. వెనువెంట‌నే స్పందించి ప‌రిష్క‌రిస్తోందన్నారు. మంచినీటి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా జీవో విడుద‌ల చేసింద‌ని, ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు.కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు, ఎయిమ్స్ సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *