దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కొవిడ్ నిబంధనలను అమలు చేయటంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా చేయద్దనీ, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. మరో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు లేఖలో ప్రస్తావించారు. జిల్లాల్లో కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలన్నారు. కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచించారు. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలని కూడా స్పష్టం చేశారు.